కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలిసిపోతుందట. యావత్ తెలంగాణకు కరీంనగర్ జిల్లా అద్దం పడుతుంది. తెలంగాణకే తలమానికం మన సింగరేణి గనులు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేతన్న మనకిక్కడ కనిపిస్తాడు. ఒగ్గు కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మిద్దె రాములు ఈ గడ్డ మీద పుట్టినవాడే. అలాగే తెలంగాణాకే జ్ఞాన పీఠాన్ని అందించిన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఇక్కడి వారే. యావత్ దక్షిణ భారతదేశానికి గర్వకారణమైన మన మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు గారు కూడా ఇక్కడి వారే. వైఎస్సార్ గారికి కూడా కరీంనగర్ తో విడదీయరాని అనుబంధం ఉంది. వైఎస్సార్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇక్కడి రైతుల కష్టాలను తెలుసుకుని ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెడతానని చెప్పారు. మాట ఇవ్వడమే కాదు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి తన మాటను నిలబెట్టుకున్న రైతునేస్తం మన రాజన్న. అదే రోజు విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. సిరిసిల్ల నేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ గారు చలించి, ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర ఆర్థిక సాయం చేశారు. నేతన్నలు మళ్లీ మళ్లీ అప్పులు ఊబిలో చిక్కుకోకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. కరీంనగర్ జిల్లాకు "రైస్ బోల్ ఆఫ్ తెలంగాణ" అని పేరు రావడానికి వైఎస్సార్ కృషి ఎంతో ఉంది.