కాళేశ్వరం గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి ఎల్లంపల్లి ఎస్సారెస్పీ, మిడ్ మానేరును నిర్మించింది వైఎస్సార్ గారే. కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సీటీ, రెండు జేఎన్టీయూలు, వెటర్నరీ హాస్పిటల్‌ను వైఎస్సార్ గారే స్థాపించారు. సింగరేణి కార్మిక క్షేత్రంగా ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 17 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారు. హైదరాబాద్ టు రామగుండం వయా కరీంనగర్ రాజీవ్ రహదారి వైఎస్సార్ గారే కట్టించారు. ఇది దేశంలోనే మొదటి ఫోర్ లేన్ హైవే. దీనివల్ల కరీంనగర్ జిల్లా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ నేటి పాలకులు అన్నీ విస్మరిస్తున్నారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెలకట్టలేనిది. అలాంటి వారిని ఎకరానికి రూ.5లక్షల చొప్పున ఇస్తామని చెప్పి, మోసం చేశారు పాలకులు. మిడ్ మానేరుకు భూములు ఇచ్చిన వారు కూడా నేటి వరకూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే నెపంతో నేరేళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇది న్యాయమేనా? ఎంత దుర్మార్గం? దీని బట్టి చేస్తే దళితులపై ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉందో తెలుస్తుంది. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది. మొన్నటిమొన్న పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదుల దంపతులను నడిరోడ్డు మీద నరికి చంపారు. దీంట్లో అధికార పార్టీ నేతల హస్తం ఉంది. కరీంనగర్ జిల్లా నుంచి ముంబాయి, దుబాయి వలసలు నేటికీ ఆగలేదు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. సిరిసిల్ల నేతల ఆత్మహత్యలు ఆగలేదు. బీడీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సింగరేణ కార్మికుల కష్టాలు తీరలేదు. లక్షకు పైగా ఉన్న కార్మికులు ఈ రోజు 40వేల కంటే ఎక్కువ లేరు. వారికి దిక్కెవరు వారి పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. నా సంకల్పం ఒక్కటే రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం. మీరంతా తోడుంటే ఎంతటి కొండనైనా ఢీకొట్టడానికి నేను రెడీ.