- వేల కోట్లు ఎటు పోతున్నయో..?
- తెలంగాణ బడ్జెట్ 2.56లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూసిన వేళ అధికార పార్టీ నాయకులు అసెంబ్లీలో 2.56లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే ప్రతీ ఏటా వేలకోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నా అవి ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతీ ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా నిధుల కేటాయింపులో అంతే స్థాయిలో ఖర్చు చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గారడి లెక్కలతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చూపిస్తున్నారే తప్ప ప్రజలకు ఆ బడ్జెట్ నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలు వాస్తవ రూపం దాల్చడానికి కొన్ని ఏండ్లు గడుస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో మాత్రం ప్రతీ ఏటా లెక్కల గారడీ చేస్తూ ప్రజలకు వేల కోట్లు, లక్షల కోట్లు అని చూపిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.30లక్షల కోట్లు. ఈ ఏడాది 26వేల కోట్లు పెంచి బడ్జెట్ ను రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టింది. పోయిన ఏడాది వ్యవసాయానికి 25వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్ లో కేటాయించిన వేలకోట్లు ప్రభుత్వం రైతులకు ఎక్కడ కేటాయించిందో మాత్రం తెలియని పరిస్థితి ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 29వేలకోట్లు కేటాయించారు. ఆ డబ్బులు ఏ గ్రామాభివృద్ధికి కేటాయించారో తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అభివృద్ధి శూన్యంగా ఉంటున్నా బడ్జెట్ లో లెక్కలు చూపిస్తూ అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది కూడా పథకాల పేరుతో దళిత బంధుకు 17వేల కోట్లు, వ్యవసాయ రంగానికి 24వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీ చేస్తామని చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ కేటాయించి అందులోనూ 50వేలలోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నాం తర్వాత మిగిలిన వారికి మాఫీ చేస్తామని కాకమ్మ కథలు చెబుతోంది. ఇలా ప్రతీ ఏటా ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో గారఢి లెక్కలు తప్ప అమలుకు ఏమాత్రం నోచుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవ బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టాలి
కాగ్ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి 78,748 కోట్ల రాబడి వచ్చింది. 28,000 కోట్ల అప్పు ఉన్నట్టు చెబుతోంది. మద్యం ఆదాయం 7వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల ద్వారా 8 వేల కోట్లు ఆదాయం వచ్చినట్టు కాగ్ రిపోర్టు చెబుతోంది. సెప్టెంబర్ నాటికి ఈ లెక్కలు ఉన్నా అవి మరో మూడు నెలలకు అంచనా వేసినా ఫిబ్రవరిలో అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలకు, కాగ్ రిపోర్టుకు పొంతన లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం గారడి లెక్కలను చూపి మోసం చేస్తోందే తప్ప నిధులు అమలు చేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతం ఇవ్వడంలోనూ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూమి, ఇండ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వ సాయం ఇలా ఏ ఒక్క పథకానికి నిధులు కేటాయించినన్ని అందడం లేదు. ప్రభుత్వం చూపుతున్న లెక్కలు ఒకలా కేటాయిస్తున్న నిధులు మరోలా ఉండటంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.