- గతంలో కేటాయించిన నిధులు ఎటుపోయే..?
- గతంలో నిరుద్యోగ భృతికి కేటాయించిన నిధులు ఖర్చు చేయలే...
- ఉద్యోగాలు లేక ఇబ్బందుల్లో నిరుద్యోగులు
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదు. వర్షాలు సమృద్ధిగా కురిసి నీళ్లు వచ్చినా రాష్ట్ర సర్కార్ రైతుల పంటను కొనుగోలు చేయడం లేదు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నిధుల కొరత చూపించి లక్షల కోట్ల అప్పులు తెచ్చి అప్పులతెలంగాణగా మార్చేసారు. ఇక నియామకాల ఊసే లేదు. రాష్ట్రం ఏర్పాటు కోసం యూనివర్సిటీల విద్యార్థులే ఎక్కువగా పోరాడారన్నది అక్షర సత్యం. అలాంటిది ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిరుద్యోగులు ఏండ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నాంచుతూ వస్తోంది. ఇదిగో నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, ఆ తర్వాత నోటిఫికేషన్లు భారీగా ఇయ్యబోతున్నాం అని గొప్పలు చెప్పిన రాష్ట్ర సర్కార్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఏండ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు ఇక ఉద్యోగాలు వచ్చేలా లేవని చాలీచాలని జీతాలకు డిగ్రీలు, పీజీలు పక్కన పెట్టి హమాలీ పనికి సైతం వెలుతున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కొందరు నిరుద్యోగులు టీ, టిఫిన్ సెంటర్లలలో పనిచేస్తుంటే, మరికొందరు నిరుద్యోగులు తమ బాధను చెప్పుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.
నిరుద్యోగ భృతి నిధులు ఎటుపోయే..?
నిరుద్యోగులకు నోటిఫికేషన్లు తర్వాత ఇస్తామని, ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగుల కోసం ఇదిగో నిరుద్యోగ భృతి అని కొన్నేండ్ల కిందట గులాబీ దండు కొత్త పథకం తీసుకువచ్చింది. నిరుద్యోగులు చదివేందుకు ప్రతి నెలా ఖర్చుల కోసం నిరుద్యోగ భృతి ఇస్తామని రాష్ట్ర సర్కార్ చెప్పింది. నిరుద్యోగులు కుటుంబానికి భారం కాకూడదని ఖర్చులకు ఇబ్బందులు అవుతున్నాయని వారికి నేరుగా రూ.3,016 అందజేయనున్నట్టు ప్రకటించింది. ఎన్నికల హామీలతో పాటు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు సైతం కేటాయించింది. 2019-20 బడ్జెట్ లో రూ.1810 కోట్ల రూపాయలను నిరుద్యోగ భృతికి నిధులు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఆ నిధులను ఇప్పటి వరకు ఖర్చు చేయకపోవడంతో పాటు వందల కోట్లు ఎటు పోయాయో ఆ పెరుమాళ్లుకే ఎరుక.. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం నిరుద్యోగుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారు
నిరుద్యోగులను రాష్ట్ర సర్కార్ మోసం చేయడం దారుణమని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు హామీలు కురిపించి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర సర్కారుకు నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తామని, మొదటి సంతకం నిరుద్యోగుల నోటిఫికేషన్ పైనే అని పేర్కొన్నారు.