*ప్రజాప్రస్థానం పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గకేంద్రంలో వైయస్ విజయమ్మ ప్రసంగం:*
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ.. మీ షర్మిలమ్మ ప్రజాక్షేత్రంలో వీరనారిలా ముందుకెళ్తోంది. అటు అధికార పక్షాన్ని గడగడలాడిస్తూ.. ఇటు నిద్రపోతున్న ప్రతిపక్షాలను తట్టిలేపుతూ నేనున్నానంటూ మీ ముందుకు వస్తోంది. వైయస్ఆర్ బిడ్డను అక్కున చేర్చుకుని, మద్దతు తెలుపుతున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు వైయస్ఆర్ గారిని ఎంతో ప్రాణంగా ప్రేమించారు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. కన్నీరు తుడిచారు.
మేం మీకు తోడుగా ఉన్నామంటూ నిలబడ్డారు. వైయస్ఆర్ కుటుంబం ఎల్లప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటుంది. వైయస్ఆర్ గారిది స్వచ్ఛమైన ప్రేమ. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలను ప్రేమించారు. తెలంగాణ ప్రజలు ఆయనకు వెన్నంటి నిలిచారు. తెలంగాణ వెనుకబడకూడదని, ఈ ప్రాంత సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2009లో ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమిగా పోటీ చేసినా.. తెలంగాణ ప్రజలు అండగా నిలిచి అత్యధిక సీట్లు వచ్చేలా చేశారు. వైయస్ఆర్ మరణం అనంతరం ఇక్కడి ప్రజల గుండెలే ఎక్కువగా ఆగిపోయాయి. రాజన్న ఇక లేడు అనే మాట విని, వందల కుటుంబాలు సొంత కుటుంబసభ్యున్ని కోల్పోయామని బాధపడ్డాయి. ప్రజలను పరామర్శించడానికి మీ షర్మిలమ్మ 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని భావించి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడడానికి షర్మిలమ్మ మీ ముందుకు వచ్చారు. గొప్ప సంకల్పం, గొప్ప ఆశయం, గొప్ప కార్యదీక్షతో తెలంగాణ ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందించడానికి వచ్చారు. ‘‘గెలవాల్సింది ఎన్నికలు కాదు.. గెలవాల్సింది ప్రజల మనసులను’’ అన్న వైయస్ఆర్ నినాదంతో ప్రజాప్రస్థానం మొదలుపెట్టారు. ఎర్రటి ఎండలోనూ, గడగడలాడే చలిలోనూ షర్మిలమ్మ పాదయాత్ర చేపట్టారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎంతోమంది ప్రజలు షర్మిలమ్మ అడుగులు వేసి మద్దతు తెలిపారు. ఎండను సైతం లెక్క చేయకుండా అండగా నిలబట్టారు. ఇక నుంచి కూడా ప్రజలు మద్దతు ఇచ్చి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.