@నిరుద్యోగ నిరాహార దీక్ష, 10వ వారం, ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ, హయగ్రీవచారి గ్రౌండ్:
హనుమకొండ: రైతులకు రుణమాఫీ చేస్తానని గద్దెనెక్కిన కేసీఆర్.. అన్నదాతలకు తీరని అన్యాయం చేశారు. కేవలం రూ.25వేల లోపు ఉన్న 3లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. 35లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుంటే కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో మిత్తి పెరిగిపోతోంది. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు గత్యతరం లేక బయట అధిక వడ్డీకి అప్పులు చేసి, అప్పులపాలవుతున్నారు. ఎకరాలకు రూ.5వేల రైతు బంధు ఇచ్చి, అదే ఎకరాకు రూ.15వేలు కేసీఆర్ కొట్టేస్తున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. అప్పులు పెరిగిపోయి మహిళలు బంగారం తాకట్టు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పేద బిడ్డలు అవస్థలు పడుతున్నారు. రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో స్టూడెంట్ల సర్టిఫికేట్లు యాజమాన్యాల వద్ద ఇరుక్కుపోతున్నాయి. రాష్ట్రంలో కరోనాతో వేల మంది చనిపోయినా, వైద్య కోసం రోగులు అప్పులు చేసినా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఇంకితజ్ఞానం కేసీఆర్ కు లేదు.
కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఏడేండ్లలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలో 54లక్షల మంది తాము నిరుద్యోగులమని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పెట్టుకోని వారు ఇంకా లక్షల్లో ఉన్నారు అంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో తెలుస్తోంది. కండ్లు ముందే లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా... కేసీఆర్ భర్తీ చేయడం లేదు. నిరుద్యోగుల వయసు పెరిగిపోయి, నిరాశకు లోనై, సమాజంతో తలెత్తుకుని తిరగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. ఎవరి చనిపోతే నాకేంటి నా ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయని కేసీఆర్ మురిసిపోతున్నాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ ఉద్యోగం రాక నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేండ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగం రాలేదని, కాకతీయ యూనివర్సిటీ గేటు ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణంతో అయినా ప్రభుత్వం నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని, వీడియోలో చెప్పాడు. చావు, బతుకు మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా పలకరించడానికి ఒక్క టీఆర్ఎస్ లీడర్ కూడా వెళ్లలేదు. తీరా అంతా అయిపోయాక వాళ్ల తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని చెప్పాడు. ఆ హామీ కూడా నెరవేర్చకపోవడంతో ఆ తమ్ముడు మంత్రులు, ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ కాళ్ల వేళ్లా పడుతున్నాడు. ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఇంట్లో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడు. మరి కేసీఆర్ ఇంట్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారని, ఐదు ఉద్యోగాలు ఉన్నాయి?