ప్రజాప్రస్థానంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు మాట–ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, భూసమస్యలు ఉన్నాయని తెలియజేశారు. వారి సమస్యలు విన్న వైయస్ షర్మిల గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైయస్ షర్మిల గారు మాట్లాడారు.
‘‘ వైయస్ఆర్ ఐదేండ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నా అద్భుత పాలన అందించారు. ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. వైయస్ఆర్ తర్వాత వచ్చిన పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. కేసీఆర్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తే ఏం చేశారు? ఒక్క రకంగానైనా ఆదుకున్నారా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ల వ్యాపారులు తప్పా ఎవరూ బాగుపడలేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టింపు లేదు. కేవలం రూ.5వేల రైతుబంధు ఇచ్చి, రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండు. రూ.5వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని, కార్లలో తిరుగుతున్నారని బీరాలు పలుకుతున్నారు. రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకు? ఈ ముఖ్యమంత్రికి అసలు మద్దతు ధర అంటే ఏంటో కూడా తెలియదు. కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన. పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వడు. రైతు బీమా పథకానికి 60 ఏండ్ల వయో పరిమితి ఎందుకు? అంటే రైతులు 60 ఏండ్లలోనే చనిపోవాలని మీరే రైతు నుదుటిన మరణ శాసనం రాస్తున్నారా? దేశానికి మనమే విత్తనాలు సప్లై చేస్తున్నామని గొప్పలు చెబుతున్న కేసీఆర్.. ఇప్పుడు వడ్లు ఎందుకు కొనడం లేదు? ఎన్నికల ముందు రుణమాపీ అని చెప్పి మోసం చేశారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. ఇంటికో ఉద్యోగం అని, డబుల్ బెడ్ రూం అని, పోడు పట్టాలు అని, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ లు అని మోసం చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ మోసపూరిత హామీలతో కేసీఆర్ మీ ముందుకు వస్తాడు? ఈసారి దళితబంధు అంటాడు. ఎస్టీ బంధు అంటాడు. బీసీ బంధు అంటాడు. కేసీఆర్ ను ఏ మాత్రం నమ్మినా మరో ఐదేండ్లు నష్టపోవాల్సిందే. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపిస్తే కేసీఆర్ కు అమ్ముడు పోయారు. బీజేపీ, టీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కొట్లాటగా మారింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవుసాన్ని పండుగ చేస్తాం. కౌలు రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం పని చేస్తాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. కుటుంబంలోని అర్హులందరికీ 3 వేల పెన్షన్ ఇస్తాం. తొలి సంతకం ఉద్యోగాల నోటిఫికేషన్ల పైనే పెడతాం. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా చేస్తాం. మన బిడ్డలకు ఉచిత విద్య అందిస్తాం. ఆరోగ్యశ్రీని అమలు చేస్తాం. పోడు భూముల పట్టాలిస్తాం.”