* ట్యాంక్ బండ్ పై బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టిస్తాం
* మేం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాండప్ బీసీ ప్రోగ్రాం అమలు చేస్తాం
* కేసీఆర్ గొర్రెలు కాస్తరా? కేటీఆర్ బర్లు కాస్తడా?
* హరీశ్ రావు చేపలు పట్టుకోమంటే పట్టుకుంటాడా?
* బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు
* 0.5 జనాభా ఉన్న వెలమలకు ఒక సీఎం, మూడు మంత్రి పదవులా?
* 50శాతం ఉన్న బీసీలకు మూడే పదవులా?
* ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగనీయట్లే
* బీసీలను గొర్లు, బర్లు, చేపలకే పరిమితం చేశారు
* కేసీఆర్ కుటుంబానికి పదవులు.. బీసీలకు గొర్లు, బర్లా?
* బీసీలను కులవృత్తులకే పరిమితం చేస్తారా?
* చేనేతలకు రూ.2వేలు ఇస్తే ఆత్మగౌరవంతో బతికినట్లేనా?
* బీసీ ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి?
@ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో నిర్వహించిన ‘బీసీ గౌరవ సభలో’ YSR తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిల గారి ప్రసంగం:
మహబూబ్ నగర్: దేశ జనాభాలో 56 శాతం, రాష్ట్ర జనాభాలో 52 శాతం బీసీలే. శతాబ్ధాలుగా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుంది కూడా బీసీలే. దేశ సంపదను సృష్టించే సృష్టికర్తలు కూడా బీసీలే. కానీ నేడు బీసీలకు ఏం మిగిలింది? అరిగిన కంచం.. మురిగిన చారు తప్ప! దేశంలో సగానికి పైనా బీసీలు ఉన్నా.. అభివృద్ధిలో అటు ఉన్నతి వర్గానికి కాకుండా ఇటు కింద వర్గానికి కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడుతూ బతుకుతున్నారు. బీసీల వెనకబాటుకు కారణం.. వారికి అందని, వారికి దక్కని అవకాశాలే. నిజానికి వెనకబాటుతనం ఉన్నది బీసీలలో కాదు.. వెనకబాటుతనం ఉన్నది పాలకుల ఆలోచనల్లోనే.
పాలకులు బీసీలు అభివృద్ధి చెందకుండా, ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. బీసీలు అభివృద్ధి చెందితే , అధికారం ఇస్తే వారు మన చేయి దాటుతారనే ఉద్దేశంతో పాలకులు బీసీలను తొక్కి పడేస్తున్నారు. ఈ ఏడేండ్లలో కేసీఆర్ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాడే తప్ప.. వారికి చేసిందేమీ లేదు. దళిత బంధు లాగే భవిష్యత్తులో బీసీ బంధు ఇస్తామని చెబుతున్నారు? అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీసీలలో అత్యంత వెనకబడిన కులాల(ఎంబీసీ) వారికి బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారు. 2018లో కేసీఆర్ వెయ్యి కోట్లు కేటాయించారు కానీ నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2019లో మళ్లీ ఎంబీసీకి వెయ్యి కోట్లు కేటాయించారు కానీ అయిదు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నాలుగైదు కోట్లు కేటాయిస్తే ప్రశ్నించే వారు లేరనే ఉద్దేశంతో ఈఏడాది దీనిని రూ.500 కోట్లకు తగ్గించారు. ఈ నిధులలో ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదు. అసలు బీసీలను పైకి తేవాలని కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు.
బీసీలకు ఉచిత విద్య, వైద్యం, గృహ వసతి లేకుండా చేశారు. బీసీల పరిస్థితిని ఆనాడు వైయస్ఆర్ గారు అర్థం చేసుకున్నారు కాబట్టే ఫీజు రీయింబర్స్మెంట్ , ఆరోగ్య శ్రీ ని ప్రవేశపెట్టారు. బహుజనుల కోసం 46లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ వేయి ఇండ్లు కూడా కట్టించి ఇవ్వలేదు. పేద వాడికి జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలు అవుతుందనే ఉద్దేశంతో వైయస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, ఉచిత వైద్యం అందించి, పునర్జన్మ అందించారు. పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటాయనే ఉద్దేశంతో ఉచిత విద్య ప్రవేశపెట్టి, వైయస్ఆర్ గారు భరోసా ఇచ్చారు. ఏ డిగ్రీ చదువుకున్నా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులను ప్రోత్సహించారు. నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కేసీఆర్ గాలికి వదిలేశారు. కేవలం రూ.35వేలు మాత్రమే కేటాయించి, అవి కూడా విద్యార్థులకు అందకుండా చేస్తున్నారు. పేదింటి పిల్లలు చదువుకుంటే ఎంత చదువుకోకపోతే ఎంత అన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు. బీసీ బిడ్డలకు చదువు చేతికందకుండా చేస్తున్నారు. టీచర్లను, ప్రొఫెసర్లను కొత్త వారిని నియమించకుండా ఉన్నవారిని 14000 మందిని తొలగించారు. 3500 బడులను మూసి వేశారు. ఇక పిల్లలు ఏం చదువుకోవాలి? ఎలా చదువుకోవాలి?
బీసీ బిడ్డలు చదువుకోవద్దు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి రావాల్సిన పనే లేదు నాకు ఓటు బ్యాంకుగా పనికొస్తే చాలు అనుకుంటున్నాడు కేసీఆర్. వీళ్లకు చదవాల్సిన పని లేదు, ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనిలేదు. చెరువులో చేపలు, బర్లు, గొర్రెలు కాసుకోండి, కల్లు గీసుకోండి అంటూ కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. అయ్యా కేసీఆర్.. బీసీ బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? ఇలాగే వెనుకబాటులో ఉండాలా? మీరు మీ కొడుకులు మాత్రం రాజ్యాలు ఏలుతారా? ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? ఇదేనా మీరు బీసీలకు చేసే న్యాయం? అడిగే వారు ఉన్నారా? ప్రతిపక్షం ఏదైనా అడిగిందా? ఎంత సేపు కాంగ్రెస్ లీడర్లు ఎప్పుడెప్పుడు అమ్ముడు పోదామా? ఎప్పుడెప్పుడు మంచి ప్యాకేజీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఏడేండ్లుగా కేసీఆర్ నియంతపాలన సాగుతున్నా ఒక్క ప్రతిపక్షం కూడా నిలదీయలేదు.
2017లో బీసీ విద్యార్థులను కేసీఆర్ విదేశాలకు పంపిస్తామని చెప్పారు. ఒక్కక్కరికి 20లక్షలు ఖర్చు అయినా సరే విదేశాల్లో చదివిస్తానని చెప్పారు. ఎంతమంది అడిగితే అంతమందిని పంపిస్తామన్నారు. ఎంత ఖర్చు అయినా చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. కానీ 2019లో 850 మంది బీసీ బిడ్డలు విదేశాలకు వెళ్తామని అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో 200 మందిని రిజెక్ట్ చేశారు. మిగిలిన 650 మందిని అయినా పంపిస్తారు అనుకుంటే ఆరుగురిని కూడా పంపించలేదు.
బీసీలకు చేనేతలకు రూ.2వేలు ఇస్తే ఆత్మగౌరవంతో బతికినట్టేనా? రూ.2వేలు ఇస్తే వాళ్ల బతుకులు బాగు పడినట్టేనా? కేసీఆర్ గారికి గోబెల్స్ అనే వాడికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. రెండు అబద్ధాల మధ్య ఒక నిజాన్ని పెట్టి మూడు నిజాలే అని నమ్మించగల సమర్థుడు కేసీఆర్. కేసీఆర్ పాలనలో బీసీలకు ఎంతో చేస్తున్నామన్నది ఒక అబద్ధం. చేనేతలు ఎంతగానో బాగుపడుతున్నారన్నది ఇంకో అబద్ధం. చేనేతలకు రూ.2వేల పెన్షన్ మాత్రం చిన్న నిజం. రూ.2వేల పెన్షన్ ఇస్తే ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా? రూ.2వేల పెన్షన్ ఇస్తే చేనేతలు యజమానులు అయిపోతారా? రూ.2వేల పెన్షన్ ఇస్తే నేతన్నలు బాగుపడుతారా?
ముదిరాజులను రాజులు చేస్తానన్నాడు కేసీఆర్. చేపపిల్లలు ఇస్తే రాజులు అయిపోయినట్టేనా? చేపలు ఇస్తే వీళ్లు బాగు పడినట్లేనా? గొర్రెల కోసం గొల్లకురుమలు డీడీలు తీసి మూడు ఏండ్లు అయినా ఇంతవరకు గొర్రెలు ఇవ్వలేదు. ఇదీ కేసీఆర్ పాలన. చేనేతలను చేతుల మీద మోస్తానని చెప్పారు కేసీఆర్. వాళ్లకు ఏ కష్టం రానియ్యకుండా చూసుకుంటామన్నారు. కానీ ఏం చూసుకుంటున్నారు? మాటలతోనే పెరుగన్నం తినిపించి కడుపు నింపుకోమంటున్నాడు కేసీఆర్. చేనేతలను నూలు మీద 50శాతం సబ్సిడీ ఇస్తామన్నారు? చనిపోతే 5లక్షల బీమా ఇస్తానన్నాడు. హెల్త్ కార్డు ఇస్తామన్నాడు. హ్యాండ్ లూం, పవర్ లూం కార్పొరేషన్లు పెడతామన్నాడు. వాళ్లకు లోన్లు ఇస్తామన్నారు. సగానికి సగం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశాడు కేసీఆర్. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి పాట పాడుతున్నారు. ఏ స్కీం అయినా ఎలక్షన్ ఒస్తే ఆన్ అవుతుంది. ఎలక్షన్ పోతో ఆఫ్ అయిపోతుంది.
వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షల మందికి లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. కేసీఆర్ మాత్రం బీసీ కార్పొరేషన్లకు లోన్లు ఇవ్వడం లేదు. 8లక్షల అప్లికేషన్లను చెత్తబుట్టలో పడేశారు. కార్పొరేషన్ లోన్లు ఇవ్వడు. స్వయం ఉపాధి కల్పించడు. ప్రైవేటులోనైనా ఇస్తాడనుకుంటే అది కూడా లేదు. పోని ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇస్తాడనుకుంటే అది కూడా లేదు. కండ్ల ముందే 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయడం లేదు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూసి వాళ్ల ఏజ్ బార్ అవుతోంది. కుటుంబానికి భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దున్నపోతు మీద వానపడ్డట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఆధునీకకరణలో ప్రపంచం దూసుకుపోతుంటే బీసీ వర్గాలు ఎన్ని ఏండ్లుగా కులవృత్తులు చేసుకుని బతకాలి? ఈ తరం బిడ్డలకు చేపలు పట్టుకోవాలని, బర్లు, గొర్లు కాచుకోవాలని, కల్లు గీసుకోవాలని చెబుతున్నారు అంటే బీసీలను ఇంకా వెనక్కి నెట్టేసేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కులవృత్తులు చేసుకుని బతకండి అని చెబుతున్న ఈ మేధావుల ముచ్చట ఎలా ఉంది అంటే ఆటపాట మా ఇంట్లో రేపటి భోజనం మీ ఇంట్లో అన్నట్లుగా ఉంది? కులవృత్తులు చేసుకోవాలని చెప్పే మేధావులను ప్రశ్నించండి? మీరైతే కులవృత్తులు చేసుకుంటారా అని.
కేసీఆర్ గొర్రెలు కాచుకోమంటే కాచుకుంటాడా? కేటీఆర్ బర్రెలు కాచుకోమంటే కాచుకుంటాడా? హరీశ్ రావు చేపలు పట్టుకోమంటే పట్టుకుంటాడా? వాళ్లు మాత్రం కులవృత్తులు చేయరు. బీసీలు మాత్రం తరతరాలుగా కులవృత్తులు చేసుకోవాలట. ఇదెక్కడి న్యాయం కేసీఆర్? మీరు మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ మనవళ్లు, మనవరాళ్లు అంతా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. గొప్పగా ఆస్తులు సంపాదించుకోవాలి. బీసీ బిడ్డలు మాత్రం కులవృత్తులే చేసుకోవాలి. వెనకబడే ఉండాలి. దొరా బాంచన్ అని మీ కాళ్ల కింద పడి ఉండాలి. ఇందేనా కేసీఆర్ బీసీలకు చెప్పే న్యాయం. ఇందుకోసమేనా కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేశాం?
బీసీ బిడ్డలకు నైపుణ్యాలు పెంచాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీసీలకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చి. లోన్లు ద్వారా స్వయం ఉపాధి కల్పించాలి. స్టార్టప్ ఇండియా లాగా స్టాండప్ బీసీ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లను నియబడేలా చేయాలి. ఇదే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. బీసీలనే కాదు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ స్వయం సమృద్ధి కల్పించడమే మా పార్టీ లక్ష్యం. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం దారుణం. గతంలో పంచాయతీల్లో 34శాతం రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు 18 శాతం ఉంది. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఉంటే 22కు తగ్గించారు. 0.5 పర్సంట్ జనాభా ఉన్న వెలమల్లో ఒక ముఖ్యమంత్రి పదవి మరో మూడు మంత్రి పదవులు ఉంటే. 50 శాతం ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. ఇది న్యాయమేనా? తెలంగాణ శాసనసభలో 119 సీట్లు ఉంటే కేవలం 20 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. గొల్లకురుమలకు, చాకలి, సంచార కులాలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. బీసీలు రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు కేసీఆర్.
వైయస్ఆర్ హయాంలో నేతన్నలకు రుణమాఫీ అయింది. నూలు మీద పన్ను తగ్గించారు. బీసీ ముదిరాజ్‌లను బీసీ ఎ1లో చేర్చితే ఆ తర్వాతి ముఖ్యమంత్రులు దీనిని మార్చారు. బీసీ స్టూడెంట్లకు మెస్ చార్జీలను పెంచారు. బీసీ సంక్షేమం కోసం రూ.2వేల కోట్లు కేటాయించిన మహనీయుడు వైయస్ఆర్ గారు. కేసీఆర్ గారు గతంలో బీసీ మీటింగ్ పెట్టి 200 తీర్మానాలు చేశారు. వీటిని అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీసీ సబ్ ప్లాన్ ముచ్చట లేదు. కార్పొరేషన్ లోన్లు ఇవ్వరు. విదేశాలకు వెళ్లడానికి డబ్బులు ఇవ్వరు. ఏడాదికి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వరు కేసీఆర్ గారు. 25వేల కోట్లతో సమగ్ర అభివృద్ధి పేరుతో నిధులు తరలించారు. కేసీఆర్ కు దమ్ముంటే బీసీల కోసం ఖర్చు చేసిన నిధులెన్నో చెప్పాలి. 13 ఫెడరేషన్ల కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. 46 బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తామని చెప్పి, ఒక్కటి కూడా కట్టించలేదు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పి మోసం చేశారు. అధికారం ఉన్న పైస్థానంలో ఎక్కడా బీసీలే ఉండరు. దీనికి కారణం కేసీఆర్ గారికి బీసీలంటే పడదు. నాయకత్వం ఉన్న స్థానాల్లో కూర్చోబెట్టరు. ప్రభుత్వ ఆఫీసుల్లో పైస్థానంలో ఎక్కడా బీసీలు కనిపించరు.
ఈత చెట్టు ఇల్లు కాదు తాటి చెట్టు తల్లి కాదు అన్నట్లు బీసీలు లేని చట్టసభలు బీసీలకు చుట్టాలు కావు. బీసీలు ఎప్పుడైతే చట్టసభల్లో కూర్చొని నాయకత్వం వహిస్తారో అప్పుడే వారి అభివృద్ధి సాధ్యం. రాబోయే ఎన్నికల్లో బీసీలకు మెజారిటీ సీట్లు కేటాయిస్తామని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ గర్వంగా చెబుతోంది. బీసీలకు అండగా నిలబడి, వారి తరఫున పోరాటం చేస్తాం. వారిని గెలిపించుకుని, చట్టసభల్లో కూర్చోబెడతాం. ఇది మాట మీద నిలబడే వైయస్ఆర్ బిడ్డ వైయస్ షర్మిల చెబుతున్న మాట. బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడమే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంతిమ లక్ష్యం.
బీసీలను గౌరవించడం కేసీఆర్ కు ఎప్పుడూ చేతకాలేదు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది బీసీలు. తెలంగాణ తెచ్చింది బీసీలే. కానీ కేసీఆర్ ఏనాడైనా వారి రుణం తీర్చుకున్నాడా? మూడు సార్లు ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ప్రొ. జయశంకర్ సార్ ఒక బీసీ బిడ్డ. మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి ఒక బీసీ బిడ్డ. కొండా లక్ష్మణ్ బాపూజీ, మారోజి వీరన్న, సర్వాయి పాపన్న, బెల్లి లలితమ్మ బీసీలే.. ఇలా ఎంత మంది బీసీలు ఉన్నా ఒక్కరిని కూడా కేసీఆర్ గౌరవించలేదు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక ట్యాంక్ బండ్ పై బీసీ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి, వాళ్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పుతాం. అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చట్టం తేవాలని కేంద్రానికి పంపుతాం. బీసీలు నాయకులు కాకపోతే ఆ కులం బాగుపడదు. ఆ ఊర్లు బాగుపడవు. ఆ రాష్ట్రం కూడా బాగుపడదు. ఇవన్నీ జరగాలంటే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీ గణన చేపట్టాలని. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ గతంలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేశారు. ఎవరి సొత్తని ఖర్చు పెట్టారు? ప్రభుత్వ ఖర్చుతో సర్వే చేసి, సమాచారం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు సొంత లాభానికి సర్వే రిపోర్టులు వాడుకుంటున్నారు. పబ్లిక్ కు అందుబాటులో ఉంచకపోతే సర్వే డబ్బులు తిరిగి ప్రజలకు ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఏడాది నిధులు ఆ ఏడాదే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని కోరుతున్నాం. జనాభా ప్రతిపదికన సీట్లు కేటాయిస్తామని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తోంది.