ఆర్థిక ఇబ్బందుల్లో సర్పంచ్ లు
అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూపులు
నందిగామ సర్పంచ్ అప్పులు రూ.4కోట్లు
వడ్డీలు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేసిన నందిగామ సర్పంచ్
సర్పంచ్ అయి బిక్షగాడినయ్యానని ఆవేదన
ఒకప్పుడు గ్రామానికి సర్పంచ్ అంటే ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రామాలలో పనులు చేస్తూ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అభివృద్ధి పనులకు వారు చేస్తున్న అప్పులు వారిపైనే పడి ఊపిరాడకుండా చేస్తున్నాయి. సర్పంచ్ లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సర్పంచ్ లు ఆత్మహత్యాయత్నం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ బిల్లులు చెల్లించకుండా ఏండ్ల తరబడి ఇబ్బందులు పెడుతుండటంతో సర్పంచ్ లు చేసేదేమి లేక మానసికంగా, ఆర్థికంగా కుంగి పోతున్నారు. నిజామాబాద్ జిల్లా, నందిపేట సర్పంచ్ వాణి తన భర్తతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో రెండు కోట్ల రూపాయలు అప్పు చేసి అభివృద్ధి పనులు చేస్తే వాటి వడ్డీలు పెరిగి నాలుగు కోట్ల రూపాయలు అయ్యాయి తప్పా ప్రభుత్వం నుంచి బిల్లులు మాత్రం రాలేదని వారు పేర్కొన్నారు. చేసేదేమీ లేక నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ దంపతులు ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సర్పంచ్ లకు రావాల్సిన బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.