నిర్భంద విద్యతో పెరుగుతున్న ఆత్మహత్యలు
రోజులు మారినా మారని విద్యావిధానం
విద్యార్థుల తల్లిదండ్రులనూ వదలని ప్రయివేటు విద్యాసంస్థలు
రోజులు మారినా విద్యావిధానంలో మార్పులు రావడం లేదు. ప్రభుత్వాలు చెప్పుతున్నట్టు డిజిటల్ విద్య నోటి మాటలకే మిగిలిపోయింది. అయితే ఇదే అదునుగా చేసుకుని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం ఏటా వేలల్లో ఫీజులు పెంచుతున్నారు. విద్యార్థులను జైలులో బంధించినట్టుగా బంధించి వారిపై ఒత్తిడిని పెంచుతున్నారు. దీని మూలంగా ప్రస్తుత కాలంలో ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మొన్న హైదరాబాద్ లో సాత్విక్ అనే విద్యార్థి, నిన్న మహబూబ్ నగర్ జిల్లా, మణికొండలో శివకుమార్ అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. ఇలా రోజుకో ఘటన చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలోనూ హైదరాబాద్ లో పదో తరగతి ఫలితాలు వెళ్లడించిన రోజే ఐదుకుపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యావిధానంతో పాటు విద్యార్థులకు చెప్పే విధానం, వారితో స్నేహపూరితంగా ఉండటంతో కొంత మేర మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.