గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోరా..?
న్యాయం చేయాలని గుడాటిపల్లికి చెందిన 120 మంది మహిళల దీక్ష
భారీగా బలగాలను మోహరించి పనులు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం
వెంటనే వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్
గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు కోల్పోయిన ప్రజలకు న్యాయం జరగడం లేదు. మీరు పెండ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లారని మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయకపోవడంతో వారంతా దీక్షలో కూర్చున్నారు. 120 మంది మహిళలు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు 18 ఏండ్లు నిండిన ఆడళ్లకు పెండ్లితో సంబంధం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చిందని కానీ ఇప్పుడు మాట మార్చి పోలీసులను పెట్టి పనులు పూర్తి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల నుంచి ప్రజలను బయటకు రానివ్వకపోవడంతో వారు నిత్యావసర సరుకులకు, మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రజలను బంధించి పనులు చేయించుకోవడంపై YSR తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పనులకు ముందు అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతుండటం ఏంటని పేర్కొన్నారు. ఆడవారికి పెండ్లితో సంబంధం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.