- కేసీఆర్ కు తీవ్ర మతిమరుపు
- ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట..
- ప్రజలకు బర్లు, గొర్లు.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం పదవులా?
- నిరుద్యోగులు చనిపోతుంటే రాక్షసానందం పొందుతున్న కేసీఆర్
- కేసీఆర్ ను కుర్చీ దించితేనే సమస్యలకు పరిష్కారం
- హుజూరాబాద్‌లో నిరుద్యోగులు నామినేషన్లు వేయకుండా కేసీఆర్ కుట్ర
ఉమ్మడి నల్లగొండ జిల్లా, నల్లగొండ పట్టణం, క్లాక్ టవర్ వద్ద.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిల గారి ప్రసంగం::
"తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. 1200 మంది బలిదానం చేస్తే ఏర్పడిన తెలంగాణలో.. యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఉద్యమంలో ఎక్కడా కనపడని కేసీఆర్ కొడుకు కేటీఆర్, బిడ్డ కవితకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేయే తప్ప సామాన్యులకు ఏమీ దక్కలేదు. ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కండ్ల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నా.. ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఉద్యోగాలు రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయలేక ఏజ్ భారం అవుతుందని మనస్తాపం చెంది, సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు భారం కాలేక, సమాజంలో తలెత్తుకుని తిరగలేక, ప్రాణాలు వదులుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా దున్నపోతు మీద వానపడినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఉద్యమంలో ఏం చెప్పాం.. ఇప్పుడేం చేస్తున్నామనే సోయి కూడా కేసీఆర్ కు లేదు.
వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది ఫామ్ హౌజ్‌లో తిని, పడుకునేందుకా? నిజామాబాద్‌లో తన బిడ్డ కవిత ఓడిపోతే.. పదవి లేదని ఆందోళన చెంది, ఆగమేఘాల మేద ఎమ్మెల్సీ చేశాడు. కేసీఆర్ బిడ్డకు ఉన్న విలువ రాష్ట్ర ప్రజలపై లేదా?
వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు భర్తీ చేసిన మహనీయుడు వైయస్ఆర్ గారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులపాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు మన వైయస్ఆర్. ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ గారు ఐదేండ్లలోనే తెలుగువారికి 46లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఐదేండ్లలో ఒక్క చార్జీ కూడా పెంచకుండా సంక్షేమ పాలన అందించిన రికార్డు ముఖ్యమంత్రి మన వైయస్ఆర్ గారిది. ఇచ్చిన మాట ప్రకారం 64లక్షల రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు మన వైయస్ఆర్ గారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, యూనివర్సిటీలు నెలకొల్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు.వైయస్ఆర్ హయాంలో ఎంతో మంది పేదలు.. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వైయస్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది.
కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే రాక్షసానందం పొందుతున్నారు. ఆయన నిర్లక్ష్యం వల్ల ఏడేండ్లలో నిరుద్యోగం ఏడింతలు పెరిగింది. తాము నిరుద్యోగులమని 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు అంటే నిరుద్యోగ సమస్య ఎంత ఉందో తెలుసుకోవచ్చు.కేసీఆర్ పాలనలో ఉచిత విద్య, వైద్యం అటకెక్కింది. గొర్లు, బర్ల పాలన చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు బర్లు, గొర్లు కాచుకోవాలంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం రాజకీయ ఉద్యోగాలు కావాలి. ప్రజలకు మాత్రం బర్లు, గొర్లు ఇవ్వాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారు.
రాష్ట్రంలో 2 శాతానికి మించి ఉద్యోగాలివ్వమని కేటీఆర్ అంటున్నారు. తమ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికీ ఉద్యోగాలు కావాలి.. ప్రజలకు మాత్రం 2శాతానికి మించి ఇవ్వమంటున్నారు. ఇదెక్కడి న్యాయం? తెలంగాణ ప్రజలు ఒళ్లు వంచి పని చేయడం లేదని కేటీఆర్ అంటున్నారు. మరి ఫాంహౌజ్ లో పని చేయకుండా ఉంటున్నది ఎవరు ? ప్రజలు కష్టపడకపోయి ఉంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? కేసీఆర్ ఏ రోజైనా రోడ్ల మీద, రైలు పట్టాల మీద పడుకున్నారా ? లాఠీ దెబ్బలు తిన్నారా ?
కండ్ల ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. నోటిఫికేషన్లు వేయడం లేదు. స్వయం ఉపాధి చేసుకుంటామని వివిధ కార్పొరేషన్లకు పేదలు లోన్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే వాటిని పక్కన పడేశారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం లేదు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేకపోతున్నారు. ఇలాంటి పాలకులు ఉండడం మన దౌర్భాగ్యం.
2014 ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మొన్న అసెంబ్లీలో మాత్రం దళితులకు భూమి ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని, పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. కేసీఆర్ కు మతిమరుపు ఉంది. ఆయన వెంటనే తన యశోద ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోవాలి. లేదా ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేసి, ఆ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 80శాతం ప్రాజెక్టులను వైయస్ఆర్ గారే పూర్తిచేశారు. మిగిలిన 20శాతం పనులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది. పోడు భూములను పరిష్కరిస్తామని అన్ని జిల్లాల్లో ప్రసంగించిన కేసీఆర్.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు.
కేసీఆర్ కు కుర్చీ లేకుంటే మాటలు గుర్తుకొస్తాయి. కుర్చీ దొరికితే ఒక్క మాట కూడా గుర్తురాదు. కేసీఆర్ ను కుర్చీ దించితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి.
మేం పార్టీ పెట్టకముందు నుంచి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం. మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షను కూడా ప్రభుత్వం అడ్డుకుంది. అయినా కూడా మేం దీక్ష పూర్తి చేశాం. ఆ తర్వాత కూడా ఎంత హేళన చేసినా కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా ప్రకటించి, 13 వారాలుగా నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీనికి నిరసనగా హుజూరాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయాలని మేం పిలుపునిస్తే.. వారిని అనేక రకాలుగా ప్రభుత్వం అడ్డుకుంది. నామినేషన్లు వేయనీయకుండా కుట్ర పన్నింది. రిటర్నింగ్ ఆఫీసర్లు రూల్స్ పేరుతో ఇబ్బంది పెట్టారు. నిజామాబాద్‌లో పరువు పోయినట్లుగా.. హుజూరాబాద్‌లోనూ పరువు పోతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ నామినేషన్లను అడ్డుకున్నారు. అధికార మదంతో అక్కడి ఆఫీసర్లను కొన్నాడు.. పోలీసులను తొత్తులుగా మార్చుకున్నారు. వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని నియంత పాలన సాగిస్తున్నారు. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయినట్లు.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. తాలిబన్లు డ్రగ్స్ ద్వారా వ్యాపారం చేస్తుంటే.. ఇక్కడి కేసీఆర్ లిక్కర్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు. మద్యం అమ్మకాల వల్ల మహిళలు, బాలికలపై దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్రంతో మహిళల మానప్రాణాలకు విలువ లేకుండా పోయింది. హైదరాబాద్‌ను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. తెలంగాణను బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారు.
కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. కేసీఆర్ ఏడేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటే వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏడు వేల మంది రైతులు విగతజీవులయ్యారు. తెలంగాణలో ఒక్కొక్కరిపై రూ.1.5లక్షల అప్పు ఉందని ఓ సర్వే చెబుతోంది. రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి, ఆర్థికంగా దివాలా తీశారు. అన్ని కోట్ల అప్పులు చేసి పథకాలకు పైసలు లేవంటున్నారు. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. విద్య, వైద్యానికి నిధుల కొరత ఉందని చెబుతున్నారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకపోవగా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు.
విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మేం మీ పక్షాన నిలబడతాం.. మీ పక్షాన పోరాటం చేస్తాం. మీకు న్యాయం జరిగే వరకు, మీకు ఉద్యోగాలు వచ్చే వరకు వైయస్ఆర్ బిడ్డ వైయస్ షర్మిల మీ పక్షాన ఉంటుంది. అధికారంలోకి వచ్చాక మీ మేలు కోసం పనిచేస్తామని మాట ఇస్తున్నాం.
కేసీఆర్ ను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలి. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలి. 54లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలి. అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. ఇవన్నీచేతకాక పోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి.
పోలీసుల సమస్యలపై ఓ పోలీసు స్వయంగా లేఖ రాశారు. పోలీసులకు ముప్పై ఏండ్లు గడిచినా ప్రమోషన్లు లేవట. జీతాలు పదో తారీఖు వరకు వస్తలేవంటున్నరు. ఎంతో మంది పోలీసులు.. ప్రమోషన్లు లేక చనిపోతున్నరని చెబుతున్నరు. కేసీఆర్ కు సిగ్గుండాలి.. ఫాం హౌజ్‌లో ఉండి చేతగాని పరిపాలన చేయడం కంటే రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నాం."