* వైయస్ విజయమ్మ
చేవెళ్లః చేవెళ్లకు వచ్చిన ప్రజానికాన్ని చూస్తుంటే ఆనాటి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాప్రస్థానం గుర్తుకొస్తోంది. ఆనాడు వైయస్ఆర్ చెల్లెమ్మ సబిత ఇంద్రారెడ్డి గారు తన ఇలాఖా చేవెళ్లలో పాదయాత్ర మొదలుపెట్టవద్దని, అశుభమని చెప్పినా.. వైయస్ఆర్ గారు అవేమీ పట్టించుకోకుండా, అంతా శుభమేనని భావించి చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. వైయస్ఆర్ గారి పాదయాత్రను ప్రజలంతా ఆదరించి, ఆశీర్వదించారు. చేవెళ్లకు, వైయస్ఆర్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. దేవుడి సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇదే చేవెళ్ల నుంచి ఇప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర చేపడుతున్నారు. ఇక్కడి తొలి అడుగు వైయస్ఆర్ గారి విజయానికి తొలి మెట్టు అయింది. షర్మిలమ్మ కూడా ఇక్కడే తొలి అడుగు వేయడం శుభసూచకంగా అనిపిస్తుంది. వైయస్ఆర్ గారి పాదయాత్ర ఒక ఉద్యమంగా మారి అక్కడి నుంచి సీఎం కుర్చీగా వరకు వెళ్లి.. సంక్షేమ పాలనకు ఆజ్యం పోసింది. ఇక్కడి నుంచే ప్రతి సంక్షేమ పథకం పురుడు పోసుకుంది. వైయస్ఆర్ పాలన దేశంలోనే కాదు ప్రపంచమే చిరస్థాయిగా మిగిలిపోయింది.
2003 ఏప్రిల్ 9వ తేదీన మొదలు పెట్టిన వైయస్ఆర్ గారి ప్రజా ప్రస్థానం 18 ఏండ్లు పూర్తి అయినా ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది. ఆయన చేసిన యాత్ర ప్రజల మంచి కోసం చేసిన యాత్ర. పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి బాధలు తెలుసుకున్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తినడానికి తిండిలేదు. పేదల ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. రాష్ట్ర కరువు కాటకాల్లో కూరుకుపోయింది. రైతన్నలు, నేతన్నలు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వైయస్ఆర్ వచ్చాక కరువు పూర్తిగా పోయింది. తాగు, సాగునీటికి పెద్దపీట వేశారు. పేదలకు 46లక్షల పక్కా ఇండ్లు కట్టించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందించారు. పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించి, ఉన్నత చదువులు చదివించారు.
పాదయాత్ర వేల కిలోమీటర్లా? వందల కిలోమీటర్లా అని కాదు.. పాదయాత్ర ఎంత వరకు సఫలీకృతం అయింది? ఎంత మందిని కలిశాం? ఎంతమంది బాధలు విన్నామనేదే ముఖ్యం. అవి వైయస్ఆర్ గారు చేశారు కాబట్టే సంక్షేమ పాలన సాధ్యమైంది. పాదయాత్రమకు ముందు కూడా వైయస్ఆర్ గారు పోరాటాలు, దీక్షలు చేశారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజల మధ్యకు వెళ్లారు. ప్రజల కోసం జీవించారు.
వైయస్ఆర్ పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసింది. దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది. కులం, మతం, ప్రాంతం, వయసు, భాష, యాస అనే తేడా లేకుండా అశేష ప్రజానికం ఆశీర్వించారు. ఆనాటి పాదయాత్ర నః భూతో నః భవిష్యత్ అన్నట్లుగా సాగింది. ఎర్రటి ఎండలో 53 ఏండ్ల వయసులో 1475 కిలోమీటర్లు నడిచారు. ఆయన పాదయాత్ర చెరగిన ముద్ర వేసింది. ఓ ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టింది. వైయస్ఆర్ పాదయాత్ర నుంచే సర్వతోముఖాభివృద్ధి పుట్టుకొచ్చింది. వైయస్ఆర్ గారు సీఎం కాకముందే ఆయన మెదడులో ఓ ప్రణాళిక ఉంది. ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి?
రైతులకు ఏం చేయాలి? కార్మికులకు ఏం చేయాలనే విజన్ ఉండేది. జలయజ్ఞం ద్వారా 80 ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ కల్పించారు. వైయస్ఆర్ గారికి అభినవ సర్ ఆర్ధర్ కాటన్ గా బిరుదు ఇచ్చారు. వైయస్ఆర్ గారు చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకం నేడు కాళేశ్వరంగా మార్చారు. ప్రస్తుతం జిల్లాలో తాగునీరు, సాగు నీరు కనిపిస్తుంది అంటే అది వైయస్ఆర్ విజన్ మాత్రమే. సంక్షేమం, అభివృద్ధి, జలయజ్ఞంతో ప్రజలకు మేలు చేశారు. ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేశారు.
రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రుణాలు అందించారు. రైతులకు రుణమాఫీ చేశారు. అక్కాచెల్లెళ్లకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారు. మైనార్టీ సోదరులకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారు. 71లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు.
వైయస్ఆర్ ఆశయాలకు వైయస్ షర్మిలమ్మ అద్దం పడుతోంది. రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చి మీ కోసం పోరాటం చేస్తోంది. రాజన్న బిడ్డ అంటే మాట మరవదు. మాట విడువదు. మాట గురి తప్పదు. గతంలోనే ఆమె 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 52 డిగ్రీల ఎండలోనూ నడిచారు. వానలో తడిచారు.. చలిలో వణికారు.. కాలికి దెబ్బ తగిలినా పాదయాత్ర ఆపలేదు. ఆమెలో ఉన్న చిత్త శుద్ధి, పట్టుదల విశ్వసనీయత ప్రజలందరికీ తెలుసు. షర్మిలమ్మ చేపట్టే ప్రజా ప్రస్థానం యాత్రను ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాను. మీ కోసం షర్మిలమ్మ ఎప్పుడూ పోరాడుతుంది.