రాష్ట్రంలో రైతులకు బతుకులు ఆగమవుతున్నాయి. రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏడేండ్లుగా 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటితో పాటు ఇటీవల అకాల వానలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల మంత్రులు వెళ్లి చూసి వచ్చేరా తప్ప అణాపైసా పరిహారం కూడా ఇవ్వలేదు.ఇవ్వాలన్న మనసు కూడా ప్రభుత్వానికి లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో చాలా మంది యుక్త వయస్కులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఉద్యోగాలు రాక, కనీసం వ్యవసాయమైనా చేసుకుందామని పంటలు వేసి నష్టపోయారు. వీరందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీరి ఆత్మహత్యలు ఆ కుటుంబాన్ని తీరని శోకాన్ని మిగుల్చుతాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదు.
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మూడేండ్లలోనే 60వేల మంది రైతులు చనిపోయారు. ఇందులో సహజమైనవి, యాక్సిడెంట్లు, కరెంట్ షాక్‌లు, కొవిడ్, పాము కాట్లు తదితర కారణాల వల్ల చనిపోయిన 48వేల మంది ఉన్నారు. ఇతర కేటగిరీలో 12వేల మంది రైతులు చనిపోయినట్లుగా ఉంది. ఇందులో 70 నుంచి 80శాతం ఆత్మహత్యలేనని ఆఫీసర్లే చెబుతున్నారు. అంటే ఈ మూడేండ్లలో 8వేల నుంచి 9వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వమే చెబుతోంది. కేసీఆర్ గారు సిగ్గుపడాలి. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి, వారికి భరోసా ఇవ్వడానికి ఇటీవల మేం రైతు ఆవేదన యాత్ర చేపడితే చాలా మంది రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధానం కారణం అప్పులు, ఆర్థిక ఇబ్బందులే. ఏండ్లు గడుస్తుంటే అప్పులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరందరికీ పంట బీమా ఏ మాత్రం అందడం లేదు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 12 మందిని పరామర్శిస్తే.. ఇందులో 10 మంది భూమి ఉండి కూడా రైతు బీమా అందని పరిస్థితి. ఎందుకిలా అని అడిగితే రైతు వయసు 59 ఏండ్లు దాటితే ఇవ్వరి చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం? రైతు బీమాకు రైతు వయసుకు ఎలా ముడిపెడుతారు? కేసీఆర్ గారు రైతు అంటే ఎవరో నిర్వచనం చెప్పాలి.
భూమి ఉన్నవారు రైతా? పాసుబుక్కు ఉన్నవారు రైతా? 59 ఏండ్లలోపు ఉండి సాగు చేసేవారే రైతా? 60 ఏండ్లు దాటిన వారు రైతు కాదా? కౌలుకు తీసుకుని సాగు చేసేవారు రైతు కాదా? రైతు బీమా పరిమితిని 59ఏండ్లుగా ఎలా నిర్ణయిస్తరు. అంటే కేసీఆర్ దృష్టిలో 59 ఏండ్లు రాగానే రైతులు బతికి ఉండకూడదనా? మన దేశంలో సగటున ఒక వ్యక్తి 70 ఏండ్లు బతుకుతున్నాడని ఓ వైపు సర్వేలు చెబుతుంటే.. రైతు బీమాకు వయసు పరిమితి 59 ఏండ్లేనని కేసీఆర్ ఎలా నిర్ణయిస్తారు.
67ఏండ్లున్న కేసీఆర్ గారు సీఎం కావొచ్చు. ఇంటిల్లిపాది పదవులు అనుభవించవచ్చు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయవచ్చు. బాత్రూలు సైతం బుల్లెట్ ఫ్రూఫ్ లో కట్టుకోవాలి. కానీ రైతు మాత్రం 59ఏండ్లలోపు చనిపోవాలి. ఇదేనా కేసీఆర్ గారు మీరు చెప్పే న్యాయం?
67 ఏండ్లు ఉన్న కేసీఆర్ తాను పెద్ద రైతునని ఒక్క ఎకరాలోనే కోటి రూపాయలు సంపాదించానని చెప్పుకోవచ్చు.. రైతులు మాత్రం 59 ఏండ్లకే చనిపోవాలా? ప్రభుత్వ ఉద్యోగుల వయసు 61 ఏండ్లు, వాళ్లు రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ అందుతుంది. రైతులకు మాత్రం 59 దాటగానే ఏమీ అందకూడదు. ఇది మూమ్మాటికీ రాక్షసత్వమే. గతంలో కేసీఆర్ గారు సెంటు భూమి ఉన్నా 15 రోజుల్లో రైతు బీమా ఇస్తామని మాట మార్చారు.
కేసీఆర్ లెక్కల ప్రకారం.. 66 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు అందుతోంది. ఇందులో 54లక్షల మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులు. వీరిలో 41.5లక్షల మందికి మాత్రమే బీమా కడుతున్నారు. 21లక్షల మంది రైతులకు బీమా ఎగ్గొడుతున్నారు. ఇప్పటివరకు 66లక్షల మంది రైతుల్లో కేవలం సగం మందికి మాత్రమే కేసీఆర్ గారు బీమా కట్టుకుంటూ వచ్చారు. ఈ ఏడాదే దానిని 41.5లక్షలు చేశారు. చనిపోతే వచ్చే డబ్బులు కాజేస్తే ఏం బాగుపడుతారు? రైతు బీమా చూస్తుంటే కేసీఆర్ గారు ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉంది.
కౌలు రైతు అంటే కేసీఆర్ కు కనికరం లేదు. కౌలు రైతులను ఒక్కరు కూడా పలకరించేవారు లేరు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు పరిగణించడం లేదు? 80వేల పుస్తకాలు చవిదివిన అపర మేధావి కౌలు రైతు ఎవరో చెప్పాలి. భూమి లేక కౌలుకు భూమి తీసుకుని ఎవుసం చేస్తుంటే వారిని ఎందుకు గుర్తించడం లేదు. ఎల్ ఐసీ పాలసీలో 80 ఏండ్లు ఏజ్ లిమిట్ ఉంది. రైతు బీమాలో మాత్రం 59 ఏండ్లు ఉండాలట.
కేసీఆర్ గారికి కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. కేంద్రం స్పందించాలని కోరుతున్నారు. మేం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాం. 59 ఏండ్ల వయసు పరిమితిని రద్దు చేసి, పూర్తి స్థాయిలో బీమా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు స్పందించకపోతే ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేస్తాం.