* మోదీ రాష్ట్రానికి వస్తే పిల్లిని చూసిన ఎలుకలా దాక్కున్నడు
* ధర్నాల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల డ్రామాలు
* రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌పై ధర్నా చేయండి
* రైతుల అనుమతి లేకుండా సంతకం ఎలా పెట్టారని కేసీఆర్‌ను నిలదీయండి
* కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ రైతుల సమస్యలపై పోరాడలేదు
* కేసీఆర్ చివరి గింజ వరకూ వడ్లు కొనాల్సిందే
ప్రజాప్రస్థానంలో భాగంగా 48వ రోజు పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చింతల తండా నుంచి YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చేగొమ్మ గ్రామానికి చేరుకోగా గ్రామంలోని రైతు వేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ధర్నాచేపట్టి మాట్లాడారు.
- కేసీఆర్ గారు వడ్లు కొనబోమని చెప్పి రైతుల బతుకులు ఆగం చేస్తున్నరు. కేసీఆర్ వడ్లు కొనేది లేదని ప్రకటించడం వల్ల ఈ యాసంగి వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి వేస్తే , ప్రస్తుతం 35 లక్షల ఎకరాలు మాత్రమే పండిస్తున్నారు. అంటే 17 లక్షల ఎకరాలు బీడు భూముల్లా వదిలేశారు. కొందరు రైతులు ఇతర పంటలు వేసినా నష్టపోయారు.
- యాసంగి పంట వేయకముందే కేంద్రం దగ్గర కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని సంతకం పెట్టి వచ్చారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేసీఆర్ సంతకం చేశారు. ఎవరిని అడిగి సంతకం పెట్టారని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం.
- రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి రైతుల పక్షాన నిలబడకుండా సొంత లావాదేవీల కోసం సంతకం పెట్టి వచ్చి రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దని ఆదేశించారు. వరి వేసుకునే భూముల్లో వేరే పంటలు పండించలేక వరి వేసుకున్న రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని దయనీయ స్థితిలో బతుకుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కేసీఆర్ గారు కాదా?
- 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ గారికి యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలియదా? లేదా రైతులు ఎలా పోతే నాకేంటని నిర్లక్ష్యమా? కేసీఆర్ గారి స్వార్థం కోసం ఆనాడు సంతకం పెట్టి నేడు రైతులను నట్టేట ముంచారు.
- కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సంతకం పెట్టి రైతులను బావిలో తోసాడు. ఇప్పుడు రక్షించండి అంటూ మళ్లీ కేంద్రాన్నే అడుక్కుంటున్నారు.
- కేసీఆర్ గారు ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కోసం ధర్నాలు చేస్తున్నామంటూ డ్రామాలు మొదలుపెట్టారు. మీరు రైతుల కోసం కొట్లాడే వారే అయితే ఆనాడు కేంద్రం సంతకం పెట్టమని అడిగినప్పుడు మాకు యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని కేంద్రంతో ఎందుకు కొట్లాడలేదు? సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు.
- కేసీఆర్ గారికి రైతుల సంక్షేమమే ముఖ్యమైతే సంతకం పెట్టుమన్న రోజు ఎందుకు పోరాటం చేయలేదు. మోదీ రాష్ట్రానికి వస్తే పిల్లిని చూసిన ఎలుకలా ఎందుకు దాక్కున్నారు? మోదీకి ఎదురుపడి ఎందుకు ప్రశ్నించలేదు. ఒక్క సంతకంతో రైతులకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ధర్నాల పేరుతో జిల్లాల్లో డ్రామాలు చేస్తున్నారు. కేసీఆర్ గారి ఒక్క సంతకం నేడు రైతుల పాలిట మరణశాసనంగా మారింది.
- ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ధర్నాలు చేస్తున్నారట.. పరిపాలన చేయండని ప్రజలు అధికారం ఇస్తే పరిపాలన చేతగాక, వడ్లు కొనడం చేతగాక ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంది.
- పాలకులు గెలిపించిన ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి మంత్రి పదవి ఇచ్చినందుకు కేసీఆర్ పక్షాన నిలబడతారా? ధర్నా చేస్తే రైతుల హక్కుల్ని కాలరాస్తున్న కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేంద్రానికి ఎందుకు సంతకం పెట్టి వచ్చావని ప్రశ్నించాలి. రైతుల వడ్లు ఎందుకు కొనవని నిలదీయాలి.
- పరిపాలన చేయమని అధికారం ఇస్తే అప్పుల పాలైన రైతుల బతుకులను ఆగం పట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మనిషి వడ్లు వేసుకోవద్దని అంటాడా?
- ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయలేదు. రైతు బంధు పేరుతో ఇచ్చేది 5 వేలు పట్టుకుంటున్నది 25 వేలు . రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు. ఎరువులు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఇవ్వడం లేదు. యంత్రలక్ష్మీ లేదు, కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం కూడా చెల్లించడం చేతగాని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్‌ది.
- రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందేవి. ఇన్పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మి ద్వారా ఆదుకున్నారు. బోర్లు వేసుకునే రైతులకు సాయం చేశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. అంతేకాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల వరకూ రుణమాఫీ చేసి, ఆర్థికంగా ఆదుకున్నారు.మద్దతు ధరతో పాటు 20శాతం బోనస్ ప్రకటించి, వడ్లు కొన్నారు.
- ఇప్పుడు ఉన్న పాలకులకు రైతులంటే ప్రేమ లేదు, గౌరవం లేదు. రైతులు అప్పుల పాలై , నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు.
- ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు కాబట్టే రాష్ట్రంలో కేసీఆర్ ఆడిందే ఆటగా , పాడింది పాటగా సాగింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రజల సమస్యలపై పోరాడలేదు.
- ప్రజల తరఫున పోరాడేందుకే YSR తెలంగాణ పార్టీని స్థాపించాం. రాష్ట్రంలో వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాం. వ్యవసాయాన్ని మళ్లీ పండగ చేస్తాం. రైతు కూలీలు, కౌలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తాం.