– ప్రజలను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నడుపుతుండు
– మద్యం, భూములు అమ్మి నాశనం చేస్తుండు
– ఎనిమిదేండ్లు ఊరిచ్చి, 80వేల ఉద్యోగాలేనా?
– ఇంకా లక్ష ఉద్యోగాలు ప్రగతిభవన్ పై కాకులు ఎత్తుకుపోయాయా?
– కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు
– ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు రూ.25లక్షలు చెల్లించాలి
ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 33వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మూటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గిరిబోయినగూడెం, దిల్వార్ పూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఆ తర్వాత పాదయాత్ర మూటకొండూరు మండలకేంద్రానికి చేరింది. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నందున.. మూటకొండూరులో దీక్ష చేపట్టారు. ముందుగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాయంత్రం వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది. నాడు ఉద్యమంలో యువత ప్రాణాలు వదిలితే.. నేడు ఉద్యోగాల కోసం వదులుతున్నారు. ఎనిమిదేండ్లు ఊరిచ్చి ఊరిచ్చి 80వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. పీఆర్ఎసీ, బిశ్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. కానీ కేసీఆర్ ప్రకటించింది మాత్రం 80వేలే. మిగిలిన లక్ష ఉద్యోగాలు ప్రగతి భవన్ కాకులు ఎత్తుకుపోయాయా? నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగమైతే.. నిరుద్యోగానికి కారణం కేసీఆర్. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ కేసీఆర్ చేసిన హత్యలే. ఉద్యోగాలు లేక యువత ఏజ్ బార్ అయి, తల్లిదండ్రులకు భారమై, సమాజంలో తలెత్తుకోలేక నిరాశ, నిస్పృహతో కుంగిపోతుంటే.. కేసీఆర్ మాత్రం దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. వందల మంది చనిపోయినా ఏ ఒక్కరినీ పరామర్శించలేదు. ఏ కుటుంబానికి ఓదార్పు ఇవ్వలేదు. ప్రజలు తమ కోసం పనిచేస్తారని ఓట్లు వేస్తే కేసీఆర్ మాత్రం కుటుంబం కోసం పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో దాదాపు 54లక్షల మంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం వద్దే దరఖాస్తు పెట్టుకున్నారు అంటే కేసీఆర్ పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా స్కిల్ డెవలప్ మెంట్, కార్పొరేషన్ లోన్లు, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎంతో మంది ప్రాణాలు దక్కేవి. నిరుద్యోగుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేసీఆర్ కు కొంచెం కూడా ముందుచూపు లేదు. రాష్ట్రంలో ఎంతమంది చదువుకుంటున్నారు? ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి కూడా లేదు.
కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగమని మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తానని మోసం చేశాడు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశాడు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశాడు. కేసీఆర్ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, ఒక్కో కుటుంబంపై నాలుగు లక్షల అప్పు పెట్టిండు. అన్ని కోట్లు అప్పు చేసినా, ప్రజల బతుకులు మాత్రం మారలేదు.
వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందేది. అర్హులందరికీ కార్పొరేషన్ లోన్లు అందేవి. మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత వైయస్ఆర్ గారిదే. 2008లో ఒకేసారి జంబో డీఎస్సీ ద్వారా 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రభుత్వం రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. అయిదేండ్లలోనే 46లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత విద్య అందించాడు. 108, 104 సేవల ద్వారా ప్రతి గ్రామానికి ఉచిత వైద్యాన్ని చేరువ చేశారు. ఎన్నో విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు స్థాపించి ఉన్నత చదువులను దగ్గర చేశారు. ఐఐఐటీలను నెలకొల్పి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించారు. జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టులు నీళ్లు ఇచ్చి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు.
కేసీఆర్ హయాంలో మాత్రం నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు చాయ్ కొట్టు, కూరగాయల షాపులు పెట్టుకుంటున్నారు. యువతులు పత్తి ఏరడానికి పోతున్నారు. మరికొందరు యువకులు హమాలీ పనికి పోతున్నారు. ఐదారు చదివిన టీఆర్ఎస్ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు కావొచ్చు. డిగ్రీ, పీజీలు చదివిన వాళ్లు కూలీలుగా పనిచేయాలా? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు. మేం పార్టీ పెట్టకముందు నుంచే నిరుద్యోగంపై పోరాటం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ వద్ద మూడు రోజుల పాటు దీక్ష చేస్తే మాపై దాడులు చేసి, బట్టలు చింపారు. అయినా మా పోరాటాన్ని ఆపలేదు. పాదయాత్రలో ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నాం. మా పోరాటం వల్లే ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది, ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. మా పోరాటం వల్లే కేసీఆర్ 80వేల ఉద్యోగాలను ప్రకటించారు.
కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నెలలు పడుతుందని చెబుతున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్కు మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది? ఆయన కూతురు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది? ప్రజలు ఆలోచన చేయాలి. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎనిమిదేండ్లు వేచి చూసి, మరో తొమ్మిది నెలలు వేచి చూడాలట. కేసీఆర్ కుటుంబానికి మాత్రం క్షణాల్లో పదవులు వస్తాయట. వైయస్ఆర్ హయాంలో చదువుల కోసం ఆత్మహత్యలు లేవు. నిరుద్యోగుల కోసం ఆత్మహత్యలు లేవు. మహిళలు స్వయం ఉపాధి పొందారు. రైతులు ఆనందంగా ఉన్నారు.
కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. బీడి బిచ్చం కల్లు ఉద్దర అన్నట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు కేసీఆర్. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినిట్లు ఈరోజు కేసీఆర్ ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి, ఆ అప్పులను మళ్లీ ప్రజలపైనే రుద్దుతున్నాడు.
భువనగిరికి చెందిన సాయి అనే విద్యార్థికి గాంధీ మెడికల్ కాలేజీలో సీటు వస్తే.. డబ్బులు లేక జాయిన్ కాలేకపోతున్నానని చెప్పాడు. వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్ చేయడానికి పూర్తి డబ్బులు ఇచ్చే వారు. కానీ కేసీఆర్ హయాంలో విద్య వ్యాపారం అయింది. పేదింటి బిడ్డలు తమ కలలు సాకారం చేసుకోలేక దాతల ముందు చేతులు చాపుతున్నారు. ఆలేరులో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారని చెబుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? మన రాష్ట్రంలో బాలికల, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మద్యం అమ్మి, ప్రభుత్వ ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ను.. మళ్లీ నమ్మితే యావత్ తెలంగాణనే అమ్మేస్తాడు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి.
మరోసారి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో లక్షా 91వేల ఖాళీలతో పాటు కొత్త జిల్లాల వారీగా ఉన్న 3లక్షల పైచిలుకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. అర్హులైన నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలి. నిరుద్యోగుల కోసం స్మిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు మంజూరు చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలి.