- ప్రభుత్వ చర్యను విమర్శిస్తున్న రైతన్నలు
- ధాన్యం వదిలేసి కోతుల లెక్కింపేంటని ప్రశ్నలు
రాష్ట్రంలోని ఏఈవోలకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. గ్రామాల్లో నిర్దేశిత పరిధిలో ఎన్ని కోతులు ఉన్నాయో, అవి ఎన్ని గుంపులుగా చేరి తిరుగుతున్నాయో, అవి ఎక్కడ నివసిస్తున్నాయో గుర్తించాల్సిన బృహత్తర కార్యాన్ని వ్యవసాయ శాఖ వారిపై మోపింది. ఓ వైపు రైతులు వర్షాకాలంలో పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద పెట్టి ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తుంటే, వాటిని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం మాత్రం కోతుల వేటలో పడింది.
ధాన్యం తడిసిపోతోంది..
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను పెట్టుకొని అమ్మేందుకు వేచి చూస్తున్నారు. అడపాదడపా పడే వర్షాలు, మంచు కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరుగుతోంది. ధాన్యంలో తేమ శాతం ఉంటే కొనుగోలు చేయబోమంటూ అధికారులు ఆ ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారు. మళ్లీ వాటిని ఎండబెట్టే వరకు రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. అన్నదాతలు ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతూ ధాన్యం అమ్మేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం కోతుల లెక్కలు తీయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం రైతుల్లో తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
యాసంగి ఉంటేనేగా ?
యాసంగి పంటకు కోతులు ఎక్కడ నష్టం కలిగిస్తాయో అని కోతుల లెక్కలకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వానాకాలం పంటనే రైతులు ఇంకా అమ్ముకోలేదు. దానికి తోడు వరి వేయొద్దంటూ యాసంగిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అసలు పంట వేయాలా వద్దా ? అనే మీమాంసలో రైతు ఉన్నాడు. ఈ నేపథ్యంలో రైతుల అనుమానాలను, సమస్యలను తీర్చేది పోయి, కోతుల వేటలో అధికారులు మునుగుతుంటే రైతన్నల గోడు వినేదెవడు ?
విమర్శిస్తున్న రైతులు..
తమ పంటను కొనడం మానేసి కోతులను లెక్కబెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. కోతుల జనాభా లెక్కలు వేసే బదులు రైతన్నల ధాన్యం మీద, మరణిస్తున్న అన్నదాతల మీద లెక్కలు వేసి ఉంటే బాగుండని ఎద్దేవా చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇకనైనా కోతి లెక్కలు కొంచెం పక్కన పెట్టి ధాన్యం కొనాలంటూ రైతుల చేస్తున్న గోడు వినాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.