- ఫెయిలయినందుకు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం
- మరోసారి బయటపడిన ఇంటర్ బోర్డు నిర్లక్ష్య నిర్వాకం
ఇంటర్ ఫలితాలు మరోమారు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. గతేడాది ఇంటర్ ఫలితాల సమయంలో జరిగిన ఆత్మహత్యలను మర్చిపోకముందే తాజాగా మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరోనా వల్ల క్లాసులు జరగకపోవడం, సబ్జెక్టుల మీద విద్యార్థులకు పట్టు రాకముందే పరీక్షలు నిర్వహించడంతో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఆత్మహత్యలు జరగడం మరోమారు ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టింది.
ఏం జరిగింది..
కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ లోగా రెండో ఏడాది క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. రెండో ఏడాదిలో రెండు నెలలు గడిచాక అధికారులు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షలకు కేవలం నెల రోజుల సమయం ఇచ్చారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై పరీక్షలు సరిగా రాయలేకపోయారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో కేవలం 49శాతం మంది విద్యార్థులు మాత్రమే అన్ని పరీక్షలు పాసయ్యారంటేనే పరిస్థితిని అంచనా వేయవచ్చు. పాసైనవారు కూడా కేవలం అంతంత మాత్రం మార్కులతో బయటపడ్డారు.
పట్టించుకోని బోర్డు..
ప్రధాన పరీక్షలను అటుంచితే అసలు ప్రాక్టికల్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలో కూడా బోర్డుకు స్పష్టత లేకుండా పోయింది. పరీక్షలు దగ్గరికొచ్చాక హడావిడిగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. బోర్డుకే స్పష్టత లేని సమయంలో విద్యార్థుల నుంచి మెరుగైన ఫలితాలు ఆశించడం సమంజసం అనిపించుకోదు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు.
దీనికి నిరసనగా విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు వెళ్లి నిరసనలు చేపట్టారు. అయితే పోలీసులు ఆయా సంఘాల నాయకులను అరెస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. విద్యార్థులకు తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా పరీక్షలు నిర్వహించన వైనాన్ని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఖండిస్తోంది. విద్యార్థులకు మేలు కలిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డుకు సూచిస్తున్నాం. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నాం. మీకు న్యాయం జరిగేవరకూ మేము పోరాడతామని హామీ ఇస్తున్నాం.