- విమర్శలపాలవుతున్న అర్హుల ఎంపిక తీరు
- పలు చోట్ల నిరసనలు చేస్తున్న దళితులు
- చాలా చోట్ల ఇప్పటికీ పూర్తి కాని ఎంపిక
కేసీఆర్ ఘనంగా ప్రకటించిన దళిత బంధు ఇప్పుడు విమర్శలను మూటగట్టుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది అర్హులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉండే దళితులను మాత్రమే ఆ వంద మంది జాబితాలో చేర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ పథకం రాజకీయ రంగు పులుముకుంది.
జాబితాలో ఎవరి పేర్లంటే..
100 మంది జాబితాలో పేర్లు పొందిన వారిలో ముఖ్యంగా... ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉండే వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు, పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులు.. వంటి వారు ఉంటున్నారు. దీంతో పేదలైన దళితులు నిరసనలు చేయడం ప్రారంభించారు. పేర్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు తమ గ్రామాల్లోకి ప్రవేశించే సమయంలో నిరసనలు తీవ్రతరం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్ ల దిష్టిబొమ్మలను దగ్దం చేస్తున్నారు.
రిస్క్ ఎందుకులే అనుకున్నారా..?
కొంత మంది ఎమ్మెల్యేలు రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని భావించి అసలు జాబితా జోలికే వెళ్లడం మానేశారు. కొందరిని ఎంపిక చేసి, మరికొందరిని చేయకపోతే నిరసనలు జరిగే అవకాశం ఉందని భావించిన ఎమ్మెల్యేలంతా ఇలాంటి వైఖరినే అనుసరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
పూర్తికాని ఎంపిక..
పథకాన్ని అందించేందుకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై ప్రజా ప్రతినిధులు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మార్చి నాటికి దళిత బంధు యూనిట్లు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకూ చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపిక కూడా అసంపూర్ణంగా ఉంది. కొత్తగూడెం, భద్రాచలం, అశ్వరావుపేటల జాబితా ఇంకా రూపొందలేదు. కరీంనగర్, చొప్పదండిల్లో సైతం ఎంపిక పూర్తి కాలేదు. ఆందోల్ నియోజకవర్గంలో ఒక్క మండలం మినహా, మిగిలిన మండలాల్లో ఎవరికి ఇవ్వాలనే విషయం ఇంకా తేల్చలేదు.
పేదరికంలో ఉన్న దళితులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రారంభ విడతల్లోనే దళిత బంధు ఇవ్వడంలో ప్రాధాన్యత పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందని సూచిస్తున్నాం. అలా కాదని, తమను అనుసరించే వారికి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన నిరసనలు చేపట్టడానికి వెనుకాడబోమని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.