- బోర్లు వేస్తే నీరు పడలేదు
- వర్షాలు లేక పంట పండలేదు
- సాయమందించే చేయి కనపడలేదు
పంటలు పండక, నీటి కోసం వేసిన బోర్లు విఫలం కావడంతో మనస్తాపానికి గురై రైతన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని మహ్మద్ నగర్ లో చోటు చేసుకుంది. రైతన్న అంతారం రాములు (45)కు 26 గుంటల భూమి ఉంది. అయితే ఈ పొలంలో నీటి సదుపాయం లేదు. వర్షాలు పడతాయనే నమ్మకంతో వరి పంట వేశాడు. అయితే వర్షం పడలేదు. పంటకు నీరు అవసరమై పక్క పొలంవారిని కూడా అడిగి నీటు కట్టుకున్నాడు. నీటి కోసం ఆరాటపడుతూ రెండు బోర్లు కూడా వేయించాడు. దీనికి దాదాపు మూడు లక్షలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అన్నం తిన్న తర్వాత బయటకు వెళ్లొస్తానని చెప్పాడు. అనంతరం చెరువు కట్ట వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకొని మరణించారు.
రైతన్న రాములు కుటుంబానికి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి వ్యక్తం చేస్తోంది. వ్యవసాయాన్ని నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయిన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. తగిన ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందించి వారిని అప్పుల నుంచి బయటపడేసే మార్గం చూపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.