- సమస్యను తెలిపేందుకువస్తే దాష్టీకం ఏంటి ?
- 317 జీవోతో సమస్యలు సృష్టించింది ప్రభుత్వమే
- న్యాయం కోసం పోరాడితే ఉక్కుపాదమెందుకు ?
తమ స్థానికతను సవాలు చేస్తూ, భార్యా భర్తలను విడదీస్తున్న 317 జీవోలో మార్పులను కోరుతూ నిరసన చేపట్టిన ఉపాధ్యాయులను ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేయాలని చూస్తోంది. పలువురు ఉపాధ్యాయులను అరెస్టులు కూడా చేస్తోంది. ఉపాధ్యాయులు బుధవారం నిర్వహించిన మహాధర్నాలో ఈ అరెస్టుల పర్వం కనిపించింది.
తొక్కేసేందుకు శతప్రయత్నాలు..
నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేసింది. ప్రత్యేకించి పోలీసులను మోహరించిన తీరు ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. తమ హక్కుల కోసం నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్ల గడపలు తొక్కించింది. ‘మేము చదువులు చెబితేనే మీరు పోలీసులు అయ్యారు..’ అంటూ ఉపాధ్యాయులు పోలీసులతో వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
స్థానికేతర ముద్ర..
జిల్లాల విభజన, 317 జీవో కారణంగా నిర్ణీత ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారిపోతున్నారు. దీనికితోడు జూనియర్ అనే పేరుతో ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతాలకు పదుల, వందల కిలోమీటర్ల దూరంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నారు. పిల్లల చదువులు, భార్య లేదా భర్త నుంచి సుదూరమైన ప్రాంతాలకు ప్రయాణించాల్సిరావడం వంటి సమ్యలను ఈ జీఓ ఉత్పన్నం చేసింది.
ఎమ్మెల్సీ అరెస్టు..
ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు పలువురు ఉపాధ్యాయ నేతలను కూడా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు.
తమ స్థానికత, హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం అన్యాయం, అక్రమం. అసలే కోవిడ్ కారణంగా స్కూళ్లు మూతబడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఉపాధ్యాయులను రోడ్డు మీదకు వచ్చేలా చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉపాధ్యాయుల సమస్యలను ఓపికతో విని, వారికి తగిన పరిష్కారం చూపాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకపక్షంలో ఉపాధ్యాయుల తరఫున పోరాడటానికి వెనకాడబోమని స్ఫష్టం చేస్తున్నాం.