- కొత్త పోస్టులను నింపని ప్రభుత్వం
- ఉన్నోళ్లనే అటు ఇటు బదిలీలు
- పలు స్థాయిల్లో 1600కు పైగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు
పేదోడికి రోగం వస్తే ప్రభుత్వాసుపత్రికి వెళతాడు. కానీ అక్కడ డాక్టరు లేకపోతే పరిస్థితి ఏమిటి ? ఇది ఒక సమస్య అయితే భవిష్యత్తులో తయారు కాబోయే డాక్టర్లకు వైద్య వృత్తిని నేర్పడానికి కూడా ప్రొఫెసర్లు లేకపోతే అది ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది ? బహుశా ఈ విషయాలను ప్రభుత్వం పట్టించుకుంటున్నట్లు లేదు.
1600 పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 1301 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. వీటితో పాటు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు కలిపి మరో 300 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అన్నీ కలిపి 1600కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ఇక వైద్య విద్యార్థులు ఏం నేర్చుకుంటారు ? వైద్య కళాశాలల్లో వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఏం వైద్యం చేస్తారు ? ఉన్న కొద్ది మందితో ఈ వైద్యం, బోధనలను కొనసాగించడం వల్ల వారిపై తీవ్ర ఒత్తిడి పడి అసలుకే మోసం రాదా ?
బదిలీలతో సర్దుబాటు చర్యలు..
ఖాళీగా ఉన్న వైద్య బోధనాధికారుల స్థానాలను నింపేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బదిలీలను చేపట్టారు. మరో వైపు పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ వెయిటేజీ కల్పించడంలో మరో 100 మంది వరకూ ఎంబీబీఎస్ వైద్యులు పీజీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో బదిలీకి గురైన 291 మంది డాక్టర్లు, ఈ 100 మందిని కలిపితే దాదాపు 400 పోస్టులు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.
భర్తీ చేస్తే పోయేదానికి..
ఖాళీగా ఉన్న పోస్టులను నింపేందుకు ప్రభుత్వం సర్దుబాటు చర్యలను ఆలోచిస్తోంది తప్ప కొత్త వారిని తీసుకోవడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు. ఉన్నవారిని మాత్రమే ఎంతవరకని సర్దుబాటు చేయగలరు ? ప్రత్యేకించి ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇలా సర్దుబాటుకే పరిమితం కావడాన్ని మేధావి వర్గం ఖండించకపోతే ప్రభుత్వానికి సోయ ఎలా వస్తుంది ?
ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే జరగకపోతే అటు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రజల ప్రాణాలను ప్రమాదం ఏర్పడటంతో పాటు, వైద్య కళాశాలల్లో విద్యార్థులు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో నేర్చుకోలేకపోయే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఖాళీలను నింపని పక్షంలో ప్రభుత్వంతో పోరాడటానికి వెనకంజ వేయబోమని, రాష్ట్ర ప్రజల వైద్యారోగ్య శ్రేయస్సురీత్యా ఎందాకైనా వెళతామని హెచ్చరిస్తున్నాం.