- అయిదేండ్లలోనే వైయస్ఆర్ గారు అద్భుతం చేశారు
- గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మార్చారు
- వైయస్ఆర్ స్ఫూర్తితో కలిసి పనిచేయాలి
- గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ నాయకులతో వైయస్ షర్మిల
గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ నాయకులతో సమావేశమైన సందర్భంగా పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి ప్రసంగం:
వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేండ్లలో అద్భుతం చేసి చూపించారు. ఆ మహనీయుడు మరణిస్తే ఎంతోమంది గుండెలు ఆగిపోయాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరిని తన బిడ్డగా భావించి నమ్మకంగా పనిచేశారు కాబట్టే వైయస్ఆర్ గారు అందరి గుండెల్లో ఉన్నారు. హైదరాబాద్ నగరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి చేర్చారు. ఆ తర్వాత హెచ్ఎండీఏ ఏర్పాటు చేసి, నగర అభివృద్ధికి బాటలు వేశారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు రోడ్లను వెడల్పు చేశారు. నగరం చుట్టూ అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే నిర్మించారు. సాంకేతికతకు పెద్దపీట వేసి విద్య, వైద్య, ఐటీ రంగాల్లో మహానగరాన్ని ముందునిలిపారు. అయిదేళ్లలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్మించారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చారు. గ్రేటర్ లో 1.4లక్షల మందికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. హైదరాబాద్ కు మెట్రో రైల్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆరోగ్యశ్రీ ద్వారా నగర ప్రజలకు ఉచిత వైద్యం అందించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించారు. మనందనం వైయస్ఆర్ వారసులమే. వైయస్ఆర్ లాగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మన నగరం-మన పార్టీ-మన పాలన అంటూ భాగ్యనగరానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీఇన్నీకావు. అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎటుచూసినా గతుకుల రోడ్లు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్, పచ్చదనం కరువై భాగ్యనగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీఎస్ఈపాస్ లో దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా అనుమతులు రావడం లేదు. ప్రతి పేద ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీధుల్లో ఎటుచూసినా అంధకారమే. మంచినీళ్లు అందని కాలనీలు ఎన్నో ఉన్నాయి. ఏడేండ్లలో కేబుల్ బ్రిడ్జి, రెండుమూడు ఫ్లైఓవర్లు తప్ప నగరానికి చేసిందేమీ లేదు. వరదలు వస్తే భాగ్యనగరం మునిగిపోయినా.. పాలకులకు పట్టింపు ఉండదు. ఆనాడు కుతుబ్ షా గారు నా నగరాన్ని సరస్సులో చేపలవలే నింపేయాలని చక్కటి సందేశం ఇస్తే.. ఈనాడు కేసీఆర్ గారు నిజంగానే ప్రజలను నీళ్లలో ముంచుతున్నారు. పడవల్లో తిరగడం తప్పించి ఏ సాయమూ చేయరు. బస్తీ దవాఖానాలు నామమాత్రంగా ఏర్పాటు చేసి, చేతులు దులుపుకొన్నారు. ఖాళీ జాగాల కబ్జాలు.. ఖాళీ చెరువుల ఆక్రమణలు.. టీఆర్ఎస్ లీడర్లు తోడేళ్లలా భూములు తినేస్తున్నారు. సెలూన్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తానని చెప్పి, నాయీబ్రాహ్మణులను కూడా మోసం చేశారు. లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అని చెప్పి రజకులను మోసం చేశారు. జంటనగరాలలో ఇటీవల కురిసిన వర్షాలకు ద్వంసమైన దోబీఘాట్లను నేటికీ పునరుద్దరించలేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి పారుదల వ్యవస్థను విస్తరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక మాటలకే పరిమితం అయింది. ప్రధాని మోడీ మూడు నదులను అనుసంధానం చేస్తామని చెబితే అవహేళన చేసిన కేసీఆర్.. ఎన్నికల సమయంలో గోదావరితో మూసీ అనుసంధానం అని మాయమాటలు చెప్పారు.
ట్యాంక్ బండ్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గారు.. అదే ట్యాంక్ బండ్ పై 10 నిమిషాలు నిల్చోలేని స్థాయికి తెచ్చారు. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు నది మధ్యలో బోటింగ్ అన్నారు.. నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. రెండో దశ మెట్రో రైలు రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు, బీహెచ్ఎల్ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడం పక్కన పెడితే మెట్రోను నష్టాల్లోకి చేర్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ రూపురేఖలు మారుస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కాదు కదా.. ఉన్న బస్ డిపోలను అమ్మే పనిలో కేసీఆర్ ఉన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఉన్న కార్డులు పీకేశారు. సీనియర్ సిటిజన్ల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీల ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా లేదు. పేదలకు ఇండ్లు ఇవ్వాలని రాజీవ్ స్వగృహ ద్వారా వేలాది ఇండ్లు నిర్మిస్తే.. నేడు కేసీఆర్ దొర.. వాటిని అమ్మే పనిలో పడ్డాడు. 10వేల చొప్పున ఆరేండ్లకు గాను 60వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. అంటే ప్రతి డివిజన్ కు 400కోట్లు ఇచ్చినట్లుగా చెప్పారు. కానీ 10కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అంతా అవినీతిమయం. పార్టీ నాయకులు, కార్యకర్తలు దొరగారి పాలనను ప్రజలకు వివరించాలి. స్థానిక సమస్యలు తెలుసుకొని ధర్నాలు, దీక్షలు, నిరసనలు తెలియజేయాలి. స్థానికంగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారి సమస్యలు పరిష్కరించి పార్టీ తరఫున అండగా నిలబడాలి.
టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులకు అందేలా చేయాలి. వృద్ధాప్య పించన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందరికీ అందేలా చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైయస్ఆర్ గారు చేసిన మేలును ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఆదాయం పెరిగినా వాటిని సిటీ డెవలప్ మెంట్ కు ఖర్చు చేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో కాలనీలు మునిగి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పడవల్లో ప్రయాణించి, ఆహార పదార్థాలు ఇవ్వడం తప్ప వరద నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తామని ఇందుకోసం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ గారు ప్రగల్బాలు పలకడం తప్ప ఆ ఊసే ఎత్తడం లేదు. నగరంలో చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు అడుగడుగునా అధికార పార్టీ లీడర్ల చేతిలో కబ్జాకు గురవుతున్నాయి. దీనిపైన పోరాడాలి. రోడ్లన్నీ గుంతలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం లేదు. ఫ్లైఓవర్లు, డివైడర్లు నిర్మించకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నగరంలో మహిళలకు,ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించాలి. మన పార్టీ ప్రజాసేవకే అంకితం.