- సవరిస్తే పోయే దానికి మార్పు ఎందుకు ?
- కేసీఆర్ చెప్పిన అంశాలపై చట్టాలు, సవరణలు సరిపోతాయి కదా ?
- సీఎంగా ఆయనే చాలా అంశాలు అమలు చేయవచ్చు కదా ?
- ఎవరూ అడ్డుపడనప్పుడు మార్పు ఎందుకు ?
రాజ్యాంగాన్ని మార్చాలన్న అంశానికి తాను కట్టుబడి ఉన్నానని పెద్ద దొర కేసీఆర్ మరో మారు ప్రకటించారు. నూతన రాజ్యాంగంలో ఇప్పుడు ఉన్న వాటి కంటే గొప్ప అంశాలను చేర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు కూడా..
ఉదాహరణకు.. దేశంలో దళితుల శాతం 19 శాతానికి పెరిగిందని, వారికి 19 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కొత్త రాజ్యాంగం కావాలన్నారు. రిజర్వేషన్ పెంచాలంటే రాజ్యాంగాన్నే మార్చాలా ? పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి రాజ్యాంగంలోనే అనుమతి ఉంది కదా ? దాంతోనే ఇప్పటి వరకూ 100 సార్లకు పైగా పరిస్థితులకు తగ్గట్టు సవరణలు చేసుకున్నాం కదా ? ఇప్పుడు ప్రత్యేకంగా రాజ్యాంగం కావాలంటూ వ్యాఖ్యలు చేయడంలో కేసీఆర్ వ్యూహం ఏంటి ?
కొడుకు పట్టాభిషేకం..
ఏదో ఒక అడ్డదిడ్డమైన వ్యాఖ్య చేసి నేషనల్ మీడియాలో కనిపించి క్రమంగా దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ ప్రధాన ఆలోచన. తద్వారా కొడుక్కు సీఎం పీఠం అందించవచ్చనేది ఆయన తంత్రమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడే ఉండి పదవి నుంచి తప్పుకొని కొడుక్కి పట్టాభిషేకం చేస్తే విలువ ఉండబోదని గుర్తించిన దొర రాష్ట్రం దాటేందుకు వేసుకున్న ప్రణాళికగా గోచరమవుతోంది.
చట్టాలు చాలిన చోట..
కేసీఆర్ చెప్పిన అంశాలైన మౌలిక సదుపాయాలను పెంచేందుకు, అభివృద్ధిని సాధించేందుకు ప్రస్తుత రాజ్యాంగంలో ఉన్న అంశాలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. లేదా స్పష్టమైన లక్ష్యాలతో కూడిన చట్టాలు తయారు చేస్తే సరిపోతుంది. రిజర్వేషన్ల పెంపు, కేంద్ర-రాష్ట్ర అధికారాలు వంటి కీలకాంశాలలో హక్కులు సాధించడానికి పోరాటాలు చేయవచ్చు. కోర్టులను ఆశ్రయించవచ్చు. ఆ అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. అయినా కూడా రాజ్యాంగం మొత్తాన్ని మార్చాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రచారం కోసమేనని స్పష్టమవుతోంది.
రాజ్యాంగ భిక్ష..
కేసీఆర్ ప్రస్తుతం సీఎంగా పనిచేస్తున్నారంటేనే అది రాజ్యాంగంలో ఉన్న అధికరణల ఫలితం. అంతేగాక తెలంగాణ రావడం కూడా రాజ్యాంగ ఫలితమే. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు.. ఆ దూసుకుపోవడం కూడా రాజ్యాంగ ఫలితమేగదా.. మరి అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన కోరడం, దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంగాక మరేమిటి ? రాజ్యాంగం ద్వారా పదవి పొంది, ఆ రాజ్యాంగాన్నే ధిక్కరించాలని చూసే నియంతృత్వ పోకడలున్న కేసీఆర్ ను గద్దె దించకపోతే, ఇలాంటి ప్రేలాపనలు మళ్లీ మళ్లీ చేసే అవకాశం లేకపోలేదు.
రాజ్యాంగంపై అవగాహనలేమి..
కేసీఆర్ కు రాజ్యాంగంపై అవగాహన లేదనడానికి ఆయన వ్యాఖ్యలే ప్రత్యక్ష తర్కాణం. మన భారత రాజ్యాంగం దృఢ, అదృఢ అంశాల మేళవింపు. కాలానుగుణంగా సవరించుకుంటూ, కొత్త అంశాలను అమర్చుకుంటూ, పాత అంశాలను సమీక్షించుకుంటూ వెళ్లే అవకాశం ఆ మేళవింపు ద్వారా రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు చట్ట సభ్యులకు రాజ్యాంగమే కల్పించింది. ఆ హక్కుతోనే ఇప్పటికే 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని ప్రస్తుత కాల పరిస్థితులకు అనుకూలంగా సవరించుకున్నాం. దాన్ని ఇప్పుడు సమూలంగా మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంపై ఆయనకున్న అవగాహనను చెప్పకనే చెబుతున్నాయి.
దళితుల అభివృద్ధి కోసమా.. ?
దళితులకు రిజర్వేషన్, మౌలిక సదుపాయల కల్పన, పేదలకు మరింత లబ్ధి చేకూర్చడానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నాడు కేసీఆర్. అవన్నీ ప్రస్తుత రాజ్యాంగంలోనే ఉన్నాయి గదా. వాటిని అమలు చేసే స్థాయిలో కూడా ఆయన ఉన్నాడుగదా.. దళితుడికి సీఎం పదవి, మూడు ఎకరాల స్థలం, దళిత బంధును అమలు చేయడం ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నవేగా. వాటిని పూర్తిగా నిష్కల్మషంగా అమలు చేయడానికి మనసు రాని కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాలనడం హాస్యాస్పదం కాకపోతే మరేంటి ?
దెయ్యాలు వేద మంత్రాలు వల్లించినట్లుంది: వైయస్ షర్మిల
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు చదివుతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకునే వారు కేసీఆర్ ప్రెస్ మీట్ చూడాలని ఆమె ఎద్దేవా చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చకోవడానికే కేసీఆర్ రాజ్యాంగ అంశాన్ని ఎత్తుకున్నాడని మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె విమర్శించారు.
రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఏమీ సాధించలేక విఫలమై, ఇప్పుడు దేశ స్థాయిలో ఏదో సాధిద్దామని ఆశించి రాజ్యాంగంపై అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మరోసారి కోరుతున్నాం.